- అమిత్ షా వ్యాఖ్యలను ఒవైసీ వక్రీకరిస్తున్నారు
- బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్
హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) ఏ మతానికీ, వర్గానికీ వ్యతిరేకం కాదని, సమాజంలో వివక్షను రూపుమాపడమే దీని ఉద్దేశమని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో యూసీసీని అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెబితే, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆ వ్యాఖ్యలను వక్రీకరించి మతం రంగు పులుముతున్నారని ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఒవైసీ అసత్య ప్రచారం చేస్తున్నారని మంగళవారం ఓ ప్రకటనలో విమర్శించారు. దేశంలోని పౌరులందరికీ సమాన హక్కులు, సమాన చట్టాలు, సముచిత గౌరవం కల్పించడమే బీజేపీ సంకల్పమని లక్ష్మణ్ పేర్కొన్నారు.
ఏ ఒక్క వర్గాన్నీ లక్ష్యంగా చేసుకోవడానికో, కించపరచడానికో అమిత్ షా యూసీసీ అంశాన్ని ప్రస్తావించలేదన్నారు. దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌర స్మృతి అమలుకు రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లోని ఆర్టికల్ 44 ప్రాతిపదికగా ఉందని గుర్తుచేశారు. యూసీసీ ముస్లింలకో, హిందువులకో వ్యతిరేకమైనది కాదని చెప్పారు. రాజకీయ వైరుధ్యాలు సృష్టించేందుకే గోవాలో యూసీసీ అమలుపై ఒవైసీ అర్థరహిత వ్యాఖ్యలు చేస్తున్నారని లక్ష్మణ్ విమర్శించారు. గోవాలో అమల్లో ఉన్న చట్టం ఇటీవల తీసుకొచ్చిన కొత్త నమూనా కాదనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తే సహించబోమని హెచ్చరించారు.
